అతడొక సముద్రం!


బీచ్ కి వెళ్లిన ప్రతి ఒక్కడూ "నేను సముద్రాన్ని చూశా" అంటాడు.

 ఎవరైనా  "నాకు సముద్రం కనిపించింది" అనడం విన్నామా? లేదు కదూ?

సముద్రాన్ని మనం చూస్తాం. అయితే మనకి  సర్వంకషంగా ఆ సముద్రం కనపడదు.

దూకుతూ వచ్చిన కెరటాలు ఒడ్డున విరిగి, విరిసి పోతూంటాయి. ఎక్కడో కొన్ని ఫర్లాంగుల అవతల ప్రశాంత గంభీరంగానూ వుంటుంది అదే సముద్రం. 

ఒక్కొక్కసారి అక్కడ కూడా హృదయదఘ్నకల్లోలం అతలకుతలం చేసేస్తుంది. 

అయినా ఆ హడావిడి మలగిపోగానే మళ్లీ ప్రశాంతతను నిలబెట్టుకుంటుంది.

 ములుగు రాజేశ్వరరావు అనే అస్తిత్వం సరిగ్గా ఆ సముద్రసదృశం! అవును...అతడొక సముద్రం!


"నేను-బహువచనం" అనే గ్రంథం... దానిని నేను కేవలం పుస్తకం అనను... "గ్రంథం"అనే అంటాను. అది ఆయన జీవన కథనం. దానిని చదివి, దాని గురించి మాట్లాడుతున్న, వ్రాస్తున్న వారు అందరూ ఒకటే మాట అంటారు, అంటున్నారు.

 "మేము రాజేశ్వరరావుతో ఇన్నేళ్లు కలిసి పని చేశాం. ఆయన మాకు బాగా తెలుసునని అనుకున్నాం కానీ ఈ పుస్తకం చదివిన తరువాత క్రొత్తగా కనిపిస్తున్నారు. ఆయన గురించి మాకేమీ తెలియదని ఇప్పుడే తెలిసింది" అని నిర్ఘాంతపోతున్నారు. అలాటి వారిలో నేనూ ఒకడిని.

 దాదాపు ఆరేళ్ల కాలం ఆంధ్రపత్రిక దినపత్రికలో ఆయనతో కలిసి పని చేసే అవకాశం కలిగింది నాకు. ఆ సాహచర్యం వరకే ఆయన నాకు తెలుసు. అంతే! అనంతర కాలంలో ఆయన "చినవ్యాసుడు"గా కవిత్వావతారం పరిచయం అయాక కొంత అచ్చెరువు "ఆ రాజేశ్వరరావేనా?" అని! అవును... ఆ మనిషే అనేదానికి ఆ మాటల పదును, భావ తీవ్రత, అభివ్యక్తి గాఢత "అవును... ఇది ఆయనేను!" అని ఋజువు చేశాయి.

 ఇంతకీ "నేను-బహువచనం" అనడంలోనే ఒకానొక తాత్విక గాఢత వుంది. ఈ లోకంలో ప్రతివాడూ "నేను"  అనుకుంటాడు. ఆ "నేను" రూపొందడానికి ఆ ఒక్క "నేను" చాలదు... అనేక "నేను"లు తలకొక చేయి వేసి నిలబెడితేనో, కూలదోస్తేనో ఈ "నేను" తయారవుతుంది.  అలాటి "నేను"లు ఈ గ్రంథంలో వున్నారు. వారందరూ కలిసి "నేను-బహువచనం" కాక ఏకవచనం ఎలా అవుతుంది? కనుక రాజేశ్వరరావు ఏకవచనం కాదు...బహువచనం! దీనిని చదివిన ప్రతివాడూ ఏదో ఒక చోట రాజేశ్వరరావుతో "కనెక్ట్" అయిపోయి, తనను తాను అద్దంలో చూసుకుంటాడు. అలా కూడా రాజేశ్వరరావు "ఏకవచనం" కాదు..." బహువచనం"!

 ఇప్పటివరకూ ఈ పుస్తకం చదివిన వారందరూ రాజేశ్వరరావు అనే ఒకానొక మనిషి చేసిన జీవన పోరాటాలూ, ప్రయత్నాలూ, వైఫల్యాలూ, తిరిగీ కాలూ-చెయ్యి కూడదీసుకుని నిలబడటానికి ఎప్పటికప్పుడు ఉద్యుక్తుడు కావడం గురించి మాట్లాడారు, వ్రాశారు.

 ఈ పుస్తకం చదువుతూంటే నాకు గుర్తుకు వచ్చినది ఒక ఉపనిషద్వాక్యం! "ఉత్తిష్ఠ! జాగ్రత! ప్రాప్యవరాన్నిబోధత!"

 "లే! మేలుకో! లక్ష్యాన్ని చేరేవరకూ విశ్రమించకు!"

 సరిగ్గా రాజేశ్వరరావు చేసిన పని అదే ఉపనిషద్వాక్య పరిపాలనం!!

 ఒక "సాధారణ" తెలుగు జర్నలిస్ట్ నడవడానికే కాదు... కనీసం ఆ వైపు చూడటానికి కూడా "భయ" పడే దారుల్లో "నిర్భయం"గా నడిచాడు... గెలిచాడా? లేదు... చివరి నిమిషం మోసం చేసింది... క్రొత్త దారులు అన్వేషించాడు... ఎక్కడా నిరాశతోనోనిస్పృహతోనో ఆగిపోలేదు. అవును... అతనొక సముద్రం! ఉవ్వెత్తున లేచిన కెరటం ఒడ్డున విరిగి పోయిందని సముద్రం ఆగిపోతుందా? ఫర్లాంగుల అవతల ప్రశాంతత అసలు రాజేశ్వరరావు! ఒడ్డును చేరి కూడా విరిసిపోయిన కెరటం రాజేశ్వరరావు జీవితం!

 ఈ గ్రంథంలో...  మనిషి బ్రతుకులో వుండటానికి అవకాశం వున్న ప్రతి కష్టం, మనిషి బ్రతుకులో వుండటానికి అవకాశం వున్న ప్రతి ప్రయత్నం, మనిషి బ్రతుకులో వుండటానికి అవకాశం వున్న ప్రతి వైఫల్యం వున్నాయి. అలాగే ఈ గ్రంథంలో మనిషి బ్రతుకులో వుండవలసిన ధైర్యం, మనిషి బ్రతుకులో వుండవలసిన నీతి-నిజాయితీ, మనిషి బ్రతుకులో వుండవలసిన ఋజువర్తనం వున్నాయి.

 ప్రతి జర్నలిస్ట్ ఈ గ్రంథం చదవాలని అంటున్నారు. కాదు... తన బ్రతుకును మలచుకోవాలనుకునే ప్రతి "మనిషి" చదవవలసిన పుస్తకం...కాదు... అధ్యయనం చేయవలసిన "గ్రంథం"!

 ఈ "వ్రాత"లో "రాజేశ్వరరావు" అన్నానే కానీ ఆ పేరుకు "గారు" తగిలించలేదు... ఆయన నాకు ఆంధ్రపత్రిక లో సీనియర్. అయినా "గారు" అనలేదు. అమర్యాద కాదు...అగౌరవం కాదు... "గారు" అనేసి మనసా "దూరం" చేసుకోదలచలేదు!

 ... ఫణిహారం వల్లభాచార్య

 

(ఫణిహారం వల్లభాచార్య :  కవి, రచయిత,అనువాదకుడు,  సాహితీ విమర్శకుడు, సీనియర్ జర్నలిస్టు, టీవీ కార్యక్రమాల సమర్పకుడు, యూట్యూబర్..ఒక రకంగా చెప్పాలంటే...గురుపీఠం నిర్వహిస్తున్న ప్రగాఢ ఆధ్యాత్మికవాది, మరో రకంగా అయితే... జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య  పరంపరలో సాహిత్య గురువయిన మల్లంపల్లి శరభయ్యగారికి ఆత్మీయ శిష్యుడు. గురుభక్తి గాఢత ఎంతగా ఉంటుందంటే... వారిమీద ఈగవాలితే-సాహితీపరంగా... తన మాట తానే విననంత తీవ్రవాది, ఉగ్రవాదిగా మారిపోతాడు... లౌకిక అవతారంలో- అత్యంత ఆధునికుడు. పారమార్థికంగా గురువుల మార్గంలో పయనించే  సనాతన ధర్మ పరిరక్షకుడు... సాహితీసాగరతీరంలో కాకి ఈత కొట్టే నాలాంటి ఎల్కేజీలకు మార్గదర్శి.)

.....


(నేను-బహువచనం, 220 పేజీలు, రు.180)

ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతుంది.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా అయితే... ఈ పుస్తకం  అసలు ధరకే లభిస్తుంది.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి


ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.

 ........

(మీ అభిప్రాయాలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో ...Enter Comment... అని ఉన్న చోట... పెడితే అందరూ చూస్తారు... ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)


Comments

  1. నేను"లు ఈ గ్రంథంలో వున్నారు. వారందరూ కలిసి "నేను-బహువచనం" కాక ఏకవచనం ఎలా అవుతుంది? కనుక రాజేశ్వరరావు ఏకవచనం కాదు...బహువచనం!
    అవును మీరు అన్నది

    నేను-బహువచనం" అనే భావన మనల్ని అహంకారం నుండి దూరం చేస్తుంది. "అంతా నేనే చేశాను" అనే ఏకవచన అహంకారం పోయి, "అందరి వల్ల నేను ఇలా ఉన్నాను" అనే కృతజ్ఞత కలిగిన బహువచన స్పృహ కలుగుతుంది. ఇది మనిషిని మరింత వినమ్రుడిని (humble) చేస్తుంది.

    ఒక చెట్టు పెరగాలంటే దానికి విత్తనంలోని శక్తి మాత్రమే సరిపోదు; మట్టి, నీరు, గాలి, ఎండ అన్నీ కావాలి. అలాగే, మన అస్తిత్వం కూడా ఒక 'సమిష్టి నిర్మాణం'.

    మీరు చెప్పినట్లు, మనల్ని మనం ఒక "బహువచనం"గా గుర్తించినప్పుడే మనలోని సంకుచితత్వం తొలగిపోతుంది.

    ఈ పుస్తకం మీద సమీక్షకులు వ్రాసిన ప్రతిదీ ఒక్కక్క ఆలోచనను కలిగిస్తుంది

    - ప్రొ.శివదేవుని శ్రీగిరీశం, వరంగల్

    ReplyDelete
  2. Excellent Sir.... Chalaa depth tho raasaaru👍
    (Vaari gurinchi introduction koodaa goppagaa undi Sir)
    - Lakshmi Narayana, Srinagar Colony, Hyderabad

    ReplyDelete
  3. This is the topmost review ..
    - Avadhani, Ex-Reporter, The Hindu, Hyderabad

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి ఇది

It reminded me of my life...

మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా......

తెలుగు పుస్తకాన్ని చంపుతున్నది ఎవరు ?

పుస్తకాల ప్రచురణ వ్యాపారమా !!!

Simply, ‘unputdownable’

అతడనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు...