...కన్నులు చెలమలయ్యాయి


‘‘నేను ప్రస్తుతాన్ని – గతానికి శిఖరాన్ని’’

 ‘‘నేను అక్షరాన్ని – నేను సాగేదాన్ని’’

‘‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’’

 ములుగు రాజేశ్వర రావుగారి ‘‘నేను- బహువచనం’’ పుస్తకం చదువుతున్నంతసేపు...  పైన తెలిపిన ప్రముఖ కవుల మాటలే స్ఫురించాయి. స్వీయ చరిత్ర రాయాలంటే ఎంతో దమ్ము, ధైర్యం కావాలి. అవి ప్రదర్శిస్తూనే వారి బలాలు, బలహీనతలు తెలియచేసారు.  

పుస్తకం చూడగానే ‘నేను-బహువచనం’’ కవర్ పేజీ మీద జర్నలిజం, రియలిజం అన్న అక్షరాలు, రెండు మెట్లు ఎక్కడం, నాలుగు మెట్లు దిగడాన్ని సూచించే వైకుంఠపాళి బొమ్మను ముద్రించారు. . ఇవి ఆకర్షణీయంగా ఉండి పుస్తకాన్ని చదవాలనిపించేలా ఉన్నాయి.  

పుస్తకం ఆరంభంలో పేర్కొన్న.. ‘‘సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ బాగుంటాయి... కానీ గమనిస్తే ఈ రెండింటి మధ్య నా ప్రయాణం ఇంకా బాగుంటుంది’’ అన్న ప్రఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్ బెనగళ్ వ్యాఖ్య.... ...తక్కువ మాటలతో ఎక్కువ విషయాన్ని చెబుతూనే చదవబోయే కథనంపై కుతూహలాన్ని రేకెత్తించింది.

ఉద్యోగ ప్రయత్నం చేయడం, కుటుంబంలో పెద్దకుమారుడిగా బాధ్యతలు మోయడం... మిలిటరీ ఉద్యోగ సన్నాహాల సన్నివేశంలో...‘కన్నీటితో తడిసి ముద్దవుతున్న నా ముఖాన్ని తుడుస్తున్నాడు...’’ అని చదువుతుంటే కన్నులు చెలమలయ్యాయి. పరిస్థితులకనుగుణంగా సింథీ భాష బేసిక్స్ నేర్చుకున్నానని రచయిత చెబుతుంటే... పట్టుదల ఉంటే ఏదయినా సాధించవచ్చు..అని అర్థమవుతుంది. కుటుంబం ఏకైక ప్రాధాన్యత.. అని చెప్పి దానిని నడిపించడంలో ఎన్నో అవాంతరాలు ఎదురయనా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచారు. 

ఆకాశవాణిలో రచయిత రాసిన ‘వార్తావ్యాఖ్య’ తొలిసారి ప్రసారం అయినప్పుడు ‘ఇంటికెళ్ళి వినమని అక్కడి పెద్దలు చెబితే ‘ఇంట్లో రేడియో లేదు’ అన్నప్పుడు... నాకు మనసు చివుక్కుమన్నది. ‘‘ఆరోజుల్లో అంత చీకట్లో అదే నన్ను ముందుకు నడిపించిన ఇంధనం.. ధనం కాదు...’’ అని రచయిత చెప్పడం .. కష్టాలను ఇష్టంగా ఎదుర్కోవడానికి స్ఫూర్తినిచ్చేలా ఉంది. కుటుంబ బాధ్యతలు మోసే క్రమంలో... గొప్పగొప్ప సౌకర్యాలు కల్పించకపోయినా  పెద్ద దిక్కుగా ఒకవైపు ఉంటూనే... తను నమ్మిన సిద్దాంతాలు, తన కిష్టమైన పత్రికారంగంతో నడవడం రాజేశ్వర రావు గారికే సాధ్యమయింది.

ఉన్నంతలో సజావుగా సాగిపోతున్న జీవితంలో జనవరి2, 1982న జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కొన్ని నెలలపాటూ మంచానికే పరిమితమయినప్పుడు.... ఒకటి ప్రమాదం మిగిల్చిన క్షోభ, మరోవైపు కుటుంబంపై ఆర్థిక స్థితిగతుల ప్రభావం... హృదయవిదారకం. నారుపోసిన వాడే నీరు పోస్తాడు... మరలా శక్తి కూడదీసుకుని జీవన ప్రయాణాన్ని కొనసాగించడం... కొంత కాలానికి మళ్ళీ మరో దెబ్బ.. తల్లికి కాన్సర్. ఒక్క టాబ్లెట్ ఖరీదు రు.500.. సామాన్యులకు, మధ్యతరగతికి అందనిది.. ఎంత కష్టం.. తల్లిగారు స్వర్గస్తులయిన తరువాత కూడా .. తమ్ముడి, చెల్లెలి బాధ్యతలు... ఎంతటి ఔదార్యం !

శ్రీ జ్ఞానీ జైల్‌సింగ్ రాష్ట్రపతి, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి విషయం... సంతానం గారిని కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కమీషనర్ గా నియమించడం ... ఎంతో చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీఎన్.టి.రామారావు, శ్రీవై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గార్ల సమయంనాటి పరిస్థితులను, వారితో తన అనుభవాలను కళ్ళకు కట్టినట్లుగా తెలియచేసారు. వాళ్ళను మనమే చూసినంత ఆనందం కలిగింది. జర్నలిస్టుగా, ఫొటోగ్రఫీ హాబీగా చేపట్టినప్పుడు...  ఆ సమయంలో ఇద్దరు చిన్నపిల్లల తల్లి అయిన క్యాబరే డాన్సర్ కు  రాజేశ్వర రావు గారు సహాయపడిన విధానం.. ఆ తల్లికి ఎడారిలో సెలయేరే.  అక్కడ కూడా క్యాబరే డాన్సర్ల జీవనశైలి ఏవిధంగా ఉంటుందో వివరించారు.

ఏదయినా ఒక విషయాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా, క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తూ... జర్నలిజం పాఠాలు దీనితోనే మొదలవుతాయని తెలిపారు. రాజీవ్ గాంధీ హత్య సందర్భంలో చాలా వ్యాసాలు రాసారు. జనవరి 1993లో బిబిసి సంస్థ ఢిల్లీలో ‘ఫ్యూచర్ ఆఫ్  వరల్డ్ టెలివిజన్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయనకు ఆహ్వానం అందడం... గర్వకారణం. సీనియర్ జర్నలిస్టు ఎబికే ప్రసాదుగారితో కలిసి పనిచేసిన రోజుల్ని  చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదివితే చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం.

అన్నిటికంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘‘దేశపౌరుల తలరాతను రాసే ప్రజా ప్రతినిధులకు.. గ్రామపంచాయతీనుండి పార్లమెంటు వరకూ ... సమగ్ర శిక్షణ, నైపుణ్యాలను సమకూర్చే ఏర్పాటు... పొలిటికల్ ఎడ్యుకేషన్... గురించి ఆయన ఆలోచనలు.. దేశంపట్ల, ఆయనకున్న మహోన్నత లక్ష్యానికి ఉదాహరణ. నిజమే... శాసనసభలో, పార్లమెంటులో ప్రసంగించే ఎమ్మేల్యేలు, ఎంపీలు, మంత్రులు... లక్షలాది ప్రజలపట్ల బాధ్యతతో మెలిగితే ఎంత బాగుంటుంది !!!

ఇప్పుడు కూడా ఆయన క్లాస్ టెక్స్ట్ బుక్స్, తెలుగు నుంచి ఇంగ్లీష్ అనువాదాలు, ఇతర రచనలు.. రోజుకు 6-8గంటలు ఈ వయసులో పనిచేస్తున్నారంటే.. ఆయన నిత్యకృషీవలుడని అర్థమవుతుంది.

ఈ పుస్తకం మా చేతికి రావడానికి రచనగావించిన శ్రీ ములుగు రాజేశ్వర రావుగారికి, ఆయనకు సహకరించిన సతీమణి శ్రీమతి సరోజ గారికి, అక్కాచెల్లెళ్ళకు, తమ్ముడు జగన్ మోహన్ బాబు గారికి, కుమారులు రోహిత్, అభిజిత్, కోడలు శృతి గార్లకు... ముద్రణలో వారికి సహకరించిన ఎమెస్కో అధినేతలు శ్రీ డి.విజయ్ కుమార్ గారికి, సంపాదకులు శ్రీ డి. చంద్రశేఖర్ రెడ్డిగారికి, డిటిపి చేసిన శ్రీమతి విజయలక్ష్మిగారికి, కుమార్ గారికి,... ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

జీవితమే పెద్ద గ్రంథం. తరతరాలు తరగని సుమగంధం. తపస్సులా సాధించి, అందరికీ  దిశానిర్దేశం చేసారు ములుగు రాజేశ్వర రావుగారు. ఈ పుస్తకం అందరూ తప్పక చదవవలసినది, చదివించవలసినది. చివరగా ఒకమాట. ములుగు రాజేశ్వర రావు గారి కలం పేరు – చినవ్యాసుడు.

ఇట్లు

- హనీ

........

సార్ !

నా పేరు గంటా హని. మాది పశ్చిమ గోదావరి జిల్లా.. భీమవరం. ఎం.ఏ తెలుగు, ఆదూరి సీతారామమూర్తిగారి కథలపై సిద్ధాంత గ్రంథాన్ని ఆంధ్రా యూనివర్శిటీకి సమర్పించి పిహెచ్.డి పట్టా పొందాను. భీమవరం చౌడే సత్యనారాయణ కాలేజిలో కొంతకాలం తెలుగు లెక్చరర్ గా పనిచేసాను. ప్రస్తుతం మా అమ్మగారి పరిస్థితి  బాగాలేనందువల్ల.. నేనే దగ్గరుండి చూసుకోవలసిన అవసరం ఏర్పడింది.

మీ పుస్తకం కొన్న చాలా రోజుల తరువాత రివ్యూ పంపుతున్నా.. క్షమించాలి. పుస్తకం చాలా బాగుంది. పూర్తిగా చదివా.. ఇప్పుడు ఇంట్లో వాళ్లు చదువుతున్నారు.

మహోన్నత శిఖరం మీద ఉన్న, ఎంతో జీవితానుభవం ఉన్న, ఉన్నతమైన వ్యక్తిత్వంగల మీరు రాసిన పుస్తకానికి సమీక్ష రాసే అర్హత అసలు నాకు ఉందా ?

అయినా ప్రయత్నిస్తున్నా..

ఇట్లు

జి.హని.

gantahoney561@gmail.com

.......

ఆశీస్సులు

నా పుస్తకం ‘నేను-బహువచనం’ చదివినవారు పలు ప్రాంతాల నుండి అభినందనలు, ప్రశంసలు, వ్యాఖ్యలు, విమర్శలు పంపుతూనే ఉన్నారు.... అవి దాదాపు అన్నీ క్లుప్తంగానే ఉంటున్నాయి... అయితే హనీ అనే ఒక పాఠకురాలు భీమవరం నుంచి.... డబ్బులు పంపి పుస్తకాన్ని తెప్పించుకొని, పూర్తిగా చదివి, సవివరంగా దాదాపు ఒక పూర్తిస్థాయి సమీక్ష... ప్రొఫెషనల్ ఫార్మాట్ లో పంపింది. ఈ అనుభవం...  నాకు ఇదే మొదటిది... కొసమెరుపు ఏమిటంటే... ఆ పుస్తకం బయటికి రావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా తనే ఎంతో అభిమానంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంది... ఆమె ఓపిగ్గా రాసి పంపిన సమీక్షకు, నేనెవరో తెలియకపోయినా ఆమె ప్రకటించిన ప్రేమాభిమానాలకు... మనసారా కృతజ్ఞతలు, హనీ జీవితం మకరందమంత మధురంగా సాగాలన్న ఆకాంక్షతో, ఆశీర్వచనాలతో...

-       ములుగు రాజేశ్వర రావు.

..........



                                                                             నేను-బహువచనం

220 పేజీలు/Wt.210 gms = రు.180


 అధినాయక జయహే.. కవితా సంకలనం

160 పేజీలు/Wt.115gms =రు.120


ఈ పుస్తకాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతాయి.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా ఈ పుస్తకాలు అసలు ధరకే లభిస్తాయి.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి.




ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

TeluguBooks.in 

Amazon.in

Sahithi Prachuranalu 

logili.com 

 ....వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది. 

 ........

 (మీ అభిప్రాయాలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో ...Enter Comment... అని ఉన్న చోట... పెడితే అందరూ చూస్తారు... ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)

 



Comments

  1. హృదయాన్ని తాకుతూ సాగే హనీ గారి సమీక్ష, అందుకు మీ రెస్పాన్స్ 👍
    -VSR. Kesava Rao, VJA Member

    ReplyDelete
  2. Stunning and unbelievable ... ఈ ఆడపిల్ల నిజంగా మనిషి ... She is pure Gold ... All praise to her ... 👌🏻😌👌🏻...
    -Surendra Raju, Senior Journalist, writer, poet, critic. Translator

    ReplyDelete
  3. మంచి సమీక్ష రాజేశ్వరరావు గారు. ఇలాంటివే మనకు టానిక్ లా పనిచేస్తాయి. మీకు అభినందనలు.
    - Bhageeratha, Senior Film Journalist, Writer, Novelist.

    ReplyDelete
  4. అద్భుత పుస్తకానికి అందమైన సమీక్ష.
    మీ ప్రతిభ నాకు తెలుసు. ఈ అమ్మాయి ప్రతిభ ఇప్పుడు తెలిసింది. ఆశీస్సులు తల్లీ..
    - Vanga Rajendra Prasad, Senior Journalist, Financial Counselor

    ReplyDelete

Post a Comment