ఒక విలక్షణమైన ఆత్మకథ
ములుగు రాజేశ్వర రావు
గారి ‘నేను-బహువచనం’ పుస్తకం ఒక
విలక్షణమైన ఆత్మకథ. సాధారణంగా ఆత్మకథాకారులు తాము, ఏం సాధించామో చెప్పుకుంటూ తమ అడుగుజాడల్లో నడిచి బాగుపడమని పాఠకుడికి
అంతర్లీనంగా సందేశమిస్తారు. రాజేశ్వరరావు గారు అలాటి పనేమీ పెట్టుకోలేదు. తన జీవిత యాత్రను నిజాయితీగా చెప్పుకుంటూ, తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వదులుకున్న అవకాశాల గురించి ప్రస్తావించారు. తనను తాను సామాన్యుడిగానే చూపుకున్నారు తప్ప
ఎక్కడా అసాధారణ ప్రజ్ఞావంతుడనని చెప్పుకోలేదు.
జేమ్స్ జాయిస్ ‘‘యులిసిస్” లో(1920) కథానాయకుడు సామాన్యుడే. సత్యజిత్ రాయ్ సినిమా ‘‘ప్రతిద్వంద్వి” లో(1970) నాయకుడు సామాన్య మధ్యతరగతి యువకుడే. ‘‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏన్ అన్నోన్
ఇండియన్” అని నీరద్ సి. చౌధురీ (ఇంగ్లీష్ లో రచనలు చేసిన ప్రముఖ
అంతర్జాతీయ స్థాయి భారతీయ రచయిత:1897-1999) ఒక పుస్తకమే రాశారు. ఇవన్నీ పాఠకులు ఆదరించినవే. ఎందుకంటే ప్రపంచంలో సామాన్యులే ఎక్కువ. వారే కొన్ని సందర్భాల్లో అసామాన్యంగా ప్రవర్తించి, తమ ముద్ర కొడతారు. ములుగువారు యీపుస్తకానికి ‘‘నేను–బహువచనం” అనడంలోనే ఎంతో
ఔచిత్యం వుంది. అనేకమంది ‘నేను’లు యిలాగే వుంటారు. వారంతా యీపుస్తకంలో తమనుతాము చూసుకోగలుగుతారు.
ముఖపత్రం గురించి కూడా విశేషంగా చెప్పాలి. వైకుంఠపాళిలోనేకాదు, ప్రతీ జీవితంలోనూ నిచ్చెనలూ, పాములూ వుంటాయి. కానీ చాలామంది జీవితాల్లో నిచ్చెనల్లో కూడా పాములు
దూరి వుంటాయి. నిచ్చెన ఎక్కుతూండగానే అవి కాటేస్తాయి. ములుగువారి జీవితగాథలోయీ ఘట్టాలు అడుగడుగునా
చూడవచ్చు. కానీ ఆయన
తననుతాను ఆశోపహతుడిగా, దైవోపహతుడిగా చూపించుకోలేదు. మననుండి సానుభూతి, సహానుభూతి ఆశించలేదు. ఇదీ నాజీవితం అని ఏదీ దాచకుండా చెప్పారు. గుడుగుడుగుంచంబతుకు లోంచి ‘‘నేను బయటకు వచ్చి చేసిన ప్రయత్నాలివీ’’ అని వివరించారు తప్ప ప్రవచనాలు చెప్పలేదు.
ఈ స్వరం నాకు బాగా నచ్చింది. ప్రముఖుల ఆత్మకథలు చదువుతూంటే ఒకవిధమైన పరాయీకరణ వస్తుంది. వాళ్లయితే గొప్ప విజయాలు సాధించి, ప్రసిద్ధి చెందిన వాళ్లు. వారి జీవితాల నుంచి మనం నేర్చుకునేది ఏదీ లేదు
అనిపిస్తుంది. కానీ యిది చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది.
మిత్రులు రాజేశ్వర రావు గారిని అభినందిస్తూ, పుస్తకం పదిమందికీ చేరాలని ఆశిస్తున్నాను.
- డా. మోహన్ కందా
Ex Chief Secretary, Andhra Pradesh (Combined
State)
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద దొరుకుతుంది.
గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN Post ద్వారా అయితే... అసలు ధరకే లభిస్తుంది.
యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు
పుస్తకం అసలు ధర మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ
స్పష్టంగా వారి పేరు, పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో
Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.........


Comments
Post a Comment