ఈ పుస్తకం ఎందుకు చదవాలి?
‘‘నేను-బహువచనం’’
ఈ పుస్తకం చదవకముందు నాకు తెలిసిన రాజేశ్వర రావు ఒకరు !
చదివిన తరువాత నాకు అర్థమయిన 'నేను ' ... రాజేశ్వర
రావు వేరొకరు !
మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన
పాత్రికేయులు ఈ వృత్తిలో నిలదొక్కుకోవటం ఎంతో కష్టమైన విషయం. ఇలాంటి నేపథ్యం నుంచి
వచ్చి ఈ వృత్తిలో స్థిరపడటానికి ఆసక్తి, ఆ శక్తి ఉన్నా
అవకాశాలు కూడా రావాలి కదా!
అలాంటి సందిగ్ధ స్థితిలో ఖాళీగా
కూర్చొనేందుకు ఆర్థిక అవసరాలు అనుమతించవు.
రకరకాల ఉపాధి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన వాటిని వదులుకోలేని అశక్తత, ఏదో రకంగా
కొంత ఆదాయం ఉంటుంది కదా అనుకొని అంగీకరిస్తే బట్టల దుకాణంలో ఉద్యోగం, వ్యాపార
ప్రకటనల సంస్థను స్వంతంగా నడిపే సాహసం, ప్రింటింగ్
ప్రెస్ పెడదాం రమ్మని పిలిచే స్నేహం ...
ఇలాంటి ఆకర్షణలు ఎలా వెంటాడతాయో, ప్రతిదీ దేనికదే 'ఈ రంగంలో
నేను రాణిస్తాను ' అన్న విశ్వాసాన్నిచ్చే 'ప్రతిభ
గుర్తింపు ' సోపానాలు మనసుని గుంజేస్తూ మధ్యలో మాయమవుతాయో, మన
ప్రతిభకి ప్రకాశాన్ని తెచ్చే దారిలో నడిపిస్తున్నట్లే ఉండి మన శ్రమని, తెలివిని
సొమ్ము చేసుకునే శక్తులు మనతోనే ఉంటూ మనకి జ్ఞానోదయం కాకుండా ఎలా వెన్నంటి ఉంటాయో
.... ఇలాంటి అనేక అనుభవాల అవరోధాలను అనుభవిస్తూ, ఆ అనుభవాల
దుష్ఫలితాలను కూడా ఆస్వాదిస్తూ చివరికి తన మనసుకి ఇష్టమైన పాత్రికేయ వృత్తిలోనే
ఏదో ఒక క్షేత్రంలో ఒక వ్యక్తి స్థిరపడాల్సి వస్తే ... ఆ వ్యక్తి ములుగు రాజేశ్వర
రావు కావచ్చు.
ఈయన దగ్గర కలం శక్తి చాలా ఉంది. ఎన్నో మంచి
మంచి అనువాదాలు చేశారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు సమయంలో ఆ మహా సందర్భం కోసం
కొన్ని మాసాలపాటు ప్రతి వారం ఒక ప్రత్యేక సంచికను సమాచార శాఖ తరఫున తయారు చేసి, పెద్దల
ప్రశంసలు పొందారు. టివీ ఛానళ్ల కార్యక్రమాల మీద - జాతీయ స్థాయి టివి సంస్థలు సయితం అబ్బురపడేలా, అసూయచెందేలా
- తన సృజనాత్మకతతో ఒక పత్రిక నడిపారు...
ఇవన్నీ ఒక ఎత్తు. తనకి అర్హతలు ఉన్నా 'ఆంధ్ర
ప్రభ' దిన పత్రికలో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని సంపాదకుల
మీదే యాజమాన్యానికి లేఖలు రాసే సాహసం చేసి ఉద్యోగం సంపాదించిన ఆత్మ విశ్వాసం, 'ఈనాడు'లో సుఖంగా
ఉద్యోగం చేసుకుంటూ కూడా, ఎవరో కొద్దిమంది కంపోజింగ్ విభాగం సిబ్బంది సమ్మెకి దిగితే - తన ఉద్యోగం సంగతి ఆలోచించకుండా - సమ్మె చేస్తున్న
మిత్రులకు సంఘీభావంగా సమ్మె శిబిరంలో
చేరిపోయిన ఒక అపురూపమైన వ్యక్తిత్వం .. ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను, నిర్వేదానికి
గురిచేసిన కుటుంబ పరిస్థితులను తట్టుకొంటూ కూడా పాత్రికేయుడిగా, రచయితగా
జీవితం సాగించటానికే ఈనాటికీ మొగ్గు చూపుతున్న ఈ రాజేశ్వర రావు గారి 'నేను' లో
నాలుగు అంశాలు ప్రస్ఫుటంగా కనుపించాయి.
·
తాను నమ్మిన వృత్తిపట్ల అంకితభావం,
·
ఆ వృత్తి విలువల పట్ల నిబద్ధత,
·
కష్టాల్లేనప్పుడు కూడా కష్టపడి పనిచేసే
తత్త్వం,
·
నిజాయితీ-నిర్భీతి-నిష్పాక్షికత
...
...ఇలాంటి లక్షణాలున్న పాత్రికేయులు అరుదుగా కనబడతారు.
అందుకే, పాత్రికేయ
వృత్తి గౌరవించదగినదే అని సమాజం ఇంకా
అనుకొంటూ ఉంటే అందుకు కారణం రాజేశ్వర రావు వంటి పాత్రికేయులే అని చెప్పటానికి ఈ ‘నేను -బహువచనం’ పుస్తకం ఒక్కటి చాలు.
- జి.వల్లీశ్వర్,
సీనియర్ జర్నలిస్ట్, సంపాదకుడు, రచయిత, అనువాదకుడు
...................
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద దొరుకుతుంది.
గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN Post ద్వారా అయితే... అసలు ధరకే లభిస్తుంది.
యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు
పుస్తకం అసలు ధర మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ
స్పష్టంగా వారి పేరు, పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో
Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.........


Comments
Post a Comment