జీవిత కథలు ఇలా కూడా రాయవచ్చా…!!!

 


ఆత్మకథలు అన్నా, జీవితకథలు అన్నా..వాటిలో అబద్ధాలే ఎక్కువ ఉంటాయని, స్వోత్క ర్ష కు చోటు ఎక్కువ అని నాకు ఓ అపోహ ఉంది. పలువురి ఆత్మకథలు చదివినప్పుడు ఆ అనుమానం మరింత బలపడింది. కానీ, ములుగు రాజేశ్వరరావు రాసిన ‘‘నేను-బహువచనం’’ పుస్తకం    అపోహ తప్పు అన్పించేలా చేసింది. నిజాలను, నిర్భయంగా  రాయడం, జీవితంలో ఎదురైన చేదు నిజాలు, ఆ సందర్భాలలో తన నిజాయితీని, నిర్బయంగా ఒప్పుకోవడం, తన భావోద్వేగాలను ఉన్నదున్నట్లు రాస్తూ, తన తప్పిదాలను అంగీకరించడం చూసిన తర్వాత ‘‘ఇలా కూడా జీవిత కథలు  రాయవచ్చా. రాసేవారు ఉంటారా’’.. అని అన్పించింది. సిసలైన జర్నలిస్టు గా బతకాలనే సంకల్పంతో, కష్టాలకు ఎదురీది రాజేశ్వర రావు చేసిన పోరాటమే ఈ పుస్తకం.

 

 రాజేశ్వర రావుతో నా పరిచయం 50 ఏళ్లకు పైమాటే, ఆంధ్రజనతలో అతడు చేరే టప్పటికే, నేను అక్కడ ఆఫీస్  బాయ్ -కమ్- క్లర్క్- కమ్ ఫ్రూఫ్ రీడర్...  వంటి చిన్నపాటి ఉద్యోగం వెలగబెడుతున్నా. నవ్యాంధ్ర తర్వాత, పాండురంగా రావు గారి తో కలిసి ఆంధ్రజనతలో చేరిపోయా. అక్కడే రాజేశ్వరరావు, శ్రీకారం రామ్మోహన్, రంగాచారి పరిచయం. ఆ తర్వాత నేను 1977లో ఈనాడు లో సబ్ ఎడిటర్ ట్రైనీగా చేరితే, రాజేశ్వరరావు 1977 ఆగస్టు లో అదే సంస్థలో చేరాడు. అతడి షిప్ట్ లో పని చేశా  ఇద్దరి కుటుంబ నేపథ్యం దిగువ మధ్యతరగతి కావడం మా స్నేహం కొనసాగడానికి మరో కారణం కావచ్చు.

 

అయితే  మనస్తత్వాలు వేరు. అతడిది ధైర్యం, నిర్భయం, ముక్కుసూటితనం. నేను తలవంచుకుని బతికే మనస్తత్వం. ఎదురు తిరిగే ధైర్యం లేకుండా బతికేశా. అయినా ఈనాడులో 8 ఏళ్ల కన్నా పనిచేయలేకపోయా. అందుకే అతడిని చూస్తే గర్వపడుతూ ఉంటా. ఒక్కో సారి ‘ఇంత పొగరుగా ఉన్నాడే’... అనుకున్న సందర్భాలు లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టులలో ప్రతినాలుగో వాడు ‘ఈనాడు’లో చేసిన వాడే.  ఆ పత్రికలో పరిస్థితులు, వేధింపులు, ఉద్యోగులను హీనంగా చూసే మనస్తత్వం నిజంగా నిజం. అందుకే ఆ పత్రికలో రిటైర్ అయ్యేదాకా పనిచేసిన వాళ్లు పది మంది కూడా ఉండరు. అందరూ డ్రాపౌట్ లే. రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించడమో, బెదిరించి చేయించడమో కద్దు. పనిచేసే సంస్థలో నిఘా విభాగం, పితూరీల ముఠాలవల్ల టెన్షన్ వాతావరణం ఓ కారణం. ఆ పత్రిక యాజమాన్యం యూనియన్లకు వ్యతిరేకం. 1977లో ఈనాడు సమ్మె దేవులపల్లి అమర్ ఇతరులు  వెళ్ళిన తర్వాత, మళ్లీ మూడేళ్లకు ఓ కదలికవచ్చింది యూనియన్ పెట్టాలని. ఆ ప్రయత్నానికి పరోక్షంగా సహకరించినందుకు రాజేశ్వర రావుపై వేటు.

 

 నిజానికి రాజేశ్వర రావును ఆదిలాబాద్ ట్రాన్స్ ఫర్ చేసిన తర్వాత దాదాపు 2-3 ఏళ్లు నేను అతడిని కలవలేదు. ప్రభ బెంగుళూరులో చేరిపోవడంతో నేను మరో10 ఏళ్లు కలవలేదు. అప్పటికి రాజేశ్వరరావు టీవి మ్యాగజైన్ ప్రారంభించాడు.  అప్పుడే కలిశా. ఆమధ్యకాలంలో అతడు చేసిన జీవనపోరాటం ఏమిటో ఈ పుస్తకం చదివితేనే తెలిసింది.

 

ఇక రాజేశ్వరరావు జీవితం అంతా ప్రయోగాలతో సాగింది.చెల్లారామ్స్ లో పనిచేసినా, ఆంధ్రజనత, ఈనాడు, ఆంధ్రపత్రికలలో పని చేసినా ... సజావుగా సాగలేదు. తర్వాత యాడ్ ఏజెన్సీ, ప్రెస్, రేడియో, టీవి లో పనులు, తల్లి అనారోగ్యం, న్యూస్ ఏజెన్సీ- మాగ్నెట్ ఫీచర్స్, టివి & ఎలక్ట్రానిక్స్ పత్రిక,  దిన పత్రికలకు టీవీ గైడ్... ఇలా ఎన్నో.. ఎన్నెన్నో చేశాడు. మైక్రోసాఫ్ట్ కు ఛానల్ పార్ట్ నర్ గా కూడా చేసాడు. ఎందరో పెద్దలతో పరిచయం ఉన్నా, వాడుకోవడం చేతకాని వాడు.   వైఫల్యాలు ,ఆశాభంగాలు ఎదురైనా, ఓడిపోయానన్న భావన రాకుండా నిలబడిన ధీరుడి  కథే  ములుగు రాజేశ్వరరావు రాసిన ‘‘నేను బహువచనం’’.  ఇది చదవాల్సిన పుస్తకం

 

- పళ్లం రాజు మల్యాల,

సీనియర్ జర్నలిస్ట్ (9705347795)



(నేను-బహువచనం, 220 పేజీలు, రు.180)

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతుంది.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా అయితే...   అసలు ధరకే లభిస్తుంది.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి


ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.

 ........


Comments

Popular posts from this blog

ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి ఇది

It reminded me of my life...

అతడొక సముద్రం!

మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా......

తెలుగు పుస్తకాన్ని చంపుతున్నది ఎవరు ?

పుస్తకాల ప్రచురణ వ్యాపారమా !!!

Simply, ‘unputdownable’

అతడనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు...