ఈ పుస్తకం ఒక మార్మిక ఆకర్షణ


 

2025  నా జీవితంలో ఒక ముఖ్యమైన సంవత్సరం...ఎన్నో అనుభవాలూ, పాఠాలూ - నా ప్రియ మిత్రుడు లక్ష్మీనారాయణ రహస్యమిత్ర (secret  santa) గా మారి ఈ అద్భుతమైన పుస్తకం పంపించారు...పేరు తో సహా ఈ పుస్తకం ఒక మార్మిక ఆకర్షణ - మొదలు పెట్టాక మళ్ళీ కింద పెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టి పడేసిన అద్భుతం - దాని మీద నా చిన్న రివ్యూ

 

‘‘నేను- బహువచనం’’

నేనుఅన్న మాట సాధారణంగా ఏకవచనం. కానీ ‘నేను – బహువచనం’ చదువుతుంటే ఆ నేనుఅద్దంలా పగిలి... ప్రతి ముక్కలో మనమే కనిపిస్తాం. రచయిత చెప్పేది ఒక వ్యక్తి కథ కాదు; మన లోపల రోజూ జరిగే గుంపు సమావేశం. తర్కం మాట్లాడుతుంది, భయం వాదిస్తుంది, ఆశ మైక్ లాక్కుంటుంది.... అన్నిటికీ అధ్యక్షుడు ఎవరో తెలియదు. ఇది ఆ గందరగోళానికి ఇచ్చిన సాహిత్య మినిట్స్.

 

ఇక్కడ తత్త్వం ఉపన్యాసంలా కాదు; అది చాయ్ షాపు సంభాషణలా వస్తుంది. అస్తిత్వం గురించి ప్రశ్న వేస్తూ, “ఇంత డీప్‌గా ఆలోచిస్తే కాఫీ చల్లబడుతుందిఅని కన్నుగీటు. మనం ఒకే వ్యక్తిగా నటిస్తున్న బహుళ వ్యక్తిత్వాలమనే నిజం... ఇక్కడ హాస్యంతో బయటపడుతుంది. ‘నేను’ అనేది స్టేబుల్ ఫైల్ కాదు; ప్రతిరోజూ అప్‌డేట్ అవుతున్న డ్రాఫ్ట్ అని ఈ పుస్తకం సున్నితంగా చెబుతుంది.

 

వ్యంగ్యం ఇక్కడ క్రూరం కాదు... కరుణతో కూడిన నవ్వు. మన గొప్ప సిద్ధాంతాల్ని చిన్న చిన్న అలవాట్లు ఎలా ఓడిస్తాయో చూపిస్తుంది. నేనుఅన్న అహంకారం స్టేజీ మీద స్పీచ్ ఇస్తుంటే, వెనుక కూర్చున్న  సందేహం పాప్‌కార్న్ తింటూ నవ్వుతుంది. ఇదే పుస్తక బలం: మనల్ని ఖండించదు, మనతో కలిసి నవ్వుతుంది.

 

నేను బహువచనం ఒక అద్దం కాదు... కలైడోస్కోప్. తిప్పిన ప్రతిసారి కొత్త నేనుకనిపిస్తుంది. చదివి ముగించిన తర్వాత ఒకే భావన మిగులుతుంది: మనలో గుంపు ఉంది, కానీ ఆ గుంపులో ఒంటరితనం లేదు.


(వెంకట్ మంత్రి, బెంగళూరు..వారి  ఫేస్ బుక్ వాల్ నుండి)



(నేను-బహువచనం, 220 పేజీలు, రు.180)

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతుంది.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా అయితే...   అసలు ధరకే లభిస్తుంది.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి


ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.

 ........


Comments