ఈ ఆత్మకథ...మన కోసం...
అప్పటి వరకు జర్నలిజంలో నాకున్న పరిచయం వార్తలు రాసే పద్ధతులు, వాడే భాషకు సంబంధించి మాత్రమే. జర్నలిస్టులలో సన్నిహిత మిత్రులున్నారు. కాని నాకు జర్నలిజం లోతుల్లోకి వెళ్లే అవకాశమూ తక్కువే, ఆసక్తీ తక్కువే. సాంకేతికాంశాల గురించిన పరిజ్ఞానం మరీ తక్కువ. అందువల్ల ఆ సమయంలోరాజేశ్వర రావు గారి పనిలో ని విశిష్టతను
గుర్తించే అవకాశం లభించలేదు.
నేను గమనించింది ఆయన లోని సరళత్వం. సూటితనం. ఎదుటి వారిని నొప్పించకుండా
తను చెప్పదలచుకున్న విషయం చెప్పగలగడం. అయితే ఆయనలో విస్తారమైన పరిశోధనాసక్తి, శక్తి ఉందనీ, ఉద్యోగ బాధ్యతలో భాగంగాకాక తన ఆసక్తి కారణంగానే విస్తృతమైన సమాచారం సేకరిస్తూ ఉంటారని
సూచన మాత్రంగా గ్రహించ గలిగాను. ఈశ్వర రెడ్డి గారి బదిలీ
తరువాత పోలీసు పత్రిక కొద్ది కాలం మాత్రమే నడిచి ఆగిపోయింది. దానితోపాటే రాజేశ్వర రావు గారిని కలుసుకునే అవకాశం కూడా.
కొన్నేళ్ల తర్వాతే మళ్లీ ఎమెస్కోలో రాజేశ్వర రావు గారితో కలవడం. ఎమెస్కో ప్రచురించిన గ్రంథాలన్నిటి సంక్షిప్త పరిచయం
రాసే బాధ్యత ఆయన తీసుకున్నారు.
ఎమెస్కో క్యాటలాగ్లో ఆ పుస్తకాల వివరాలు ప్రచురించడం ప్రధాన లక్ష్యం. వెబ్సైట్లో కూడాఈ వివరాలను ఉపయోగించు
కోవచ్చు. క్రమంగా ఎమెస్కో ప్రచురించ
దలచుకున్న ఆంగ్లానువాద గ్రంథాల కోసం ఆయన అనువాద సామర్థ్యాన్ని వినియోగించు కోవడం, మరికొన్ని గ్రంథాల పరిష్కరణలో వారి తోడ్పాటు తీసికోవడం
మొదలయింది.
రాజేశ్వర రావు గారి సౌజన్యం ఆయనకు తటస్థపడిన ఎవరితోనైనా సత్సంబంధాలను నెలకొల్పుకోవడానికి
పురికొల్పుతుంది. ఆయన సమయ పాలన, నిబద్ధత, ఏ పనినయినా శక్తివంచన లేకుండా సమర్థంగా నిర్వహించడం, నేర్చుకోవాలన్న తపన, పనిని నిరంతరం మెరుగు పరచుకోవడానికి శ్రమించే విధానం, విస్తారమైన పరిజ్ఞానం ఆయనను ఎవరికయినా దగ్గర చేస్తుంది.
క్రమంగా ఆయనలోని కవి, రచనా సామర్థ్యం, వార్తా విశ్లేషణపటిమ అనుభవంలోకి వచ్చాయి. ఆయన బహుశా తన చాపల్యంతో రాసుకుంటున్న కవితలుగానే ఆయనచెప్తూఉన్నా, ‘చినవ్యాసుడు’ పేరుతో ఆయన తరచుగా రాసే కవితలు ఇవ్వాళ
కవిత్వం రాస్తున్న ఏ ప్రముఖ తెలుగు కవి కవితలతోనయినా పోటీపడగలవు.
ముఖ్యంగా ఆయనలో నాకు చాలా ఆశ్చర్యం గొల్పిన అంశం ఆయన సాంకేతిక పరిజ్ఞానం, దానితోపాటు అభివృద్ధి చెందుతున్న (రోజురోజుకూ ఊహించలేనన్ని మార్పులు వస్తున్న) సాంకేతిక రంగంతో ఆయన పరిచయం, దాన్ని వినియోగించుకోవాలన్న తపన, ప్రయోగశీలతలు. కాగితం మీద రాయడం తప్ప మరొకటి తెలియని నా బోటివాడు ఆయన పరిజ్ఞానానికి
విస్తుపోక తప్పదు. మా సంస్థలో కూడా దాన్ని
ఎలా వినియోగించుకోవాలో అన్న ఆలోచన పలుమార్లు కలగడమూ, దాని విషయంలో చర్చలు జరపపడమూ కూడా జరిగింది. సామర్థ్యాలూ, మానవ వనరులూ, సాంకేతిక నైపుణ్యాలూ దీనికి చాలా అవసరం. మేమంత సాంకేతికంగా ముందుకు సాగే మానసిక స్థితిలో లేమేమో.
ఇక రాజేశ్వర రావు గారి ఈ పుస్తకం గురించి రెండు మాటలు చెప్పాలి. మనకు తెలిసిన వ్యక్తులలో చాలా మందిలో మనకు కనిపిస్తున్నదే
చూస్తాం. ఆ మనిషి గతంలోకి, మనస్సులోకి ప్రవేశించే ప్రయత్నం అరుదు. ఏవైనా బాహ్య సంఘటనలు అందుకు అవకాశం కలిగించవచ్చు. కుటుంబంతో పరిచయం, కష్టసుఖాలు పంచుకోవడం ఉంటే ఈ అవకాశం మరింత ఎక్కువవుతుంది. ఏదో సంభాషణ సందర్భంలో కొంత బయటపడవచ్చు. కాని గాఢమైన లోతుపాతులు ఎవరికో ఒకరిద్దరికి తప్పతెలియవు.
రాజేశ్వర రావు గారి జీవితం నల్లేరుపై బండి నడకలా సాగవలసిందే. కాని కుటుంబ, సామాజిక పరిస్థితులు ఆ జీవితాన్ని ఎగుడుదిగుడులమయం చేశాయి. ఆయన ఈ జీవిత కథను చదివితే ఇంత ప్రతిభావంతుడి జీవితం
ఇలా సాగిందేమిటి? అన్న ప్రశ్నఎవరికయినా తలెత్తుతుంది. ఆయన అవకాశాలను కల్పించుకోగల సమర్థుడు. కల్పించుకున్నాడు కూడా. కాని అవి సఫలమవుతూ అవుతూ ఎందుకు కూలిపోయాయో! జీవితంలో ఏదో విధంగా పై అంతస్తులకు ఎగబాకే అవకాశాలను
ఉపయోగించు కోవాలా? విలువలకు, ఆత్మగౌరవానికి, స్వీయ అభిప్రాయాలకు కట్టుబడి పతనానికైనా (వ్యక్తిత్వంలోకాదు, అంతస్తులనందుకోవడంలో) సిద్ధపడాలా? అన్న సంశయం ఏర్పడ్డప్పుడు విలువలకు, ఆత్మగౌరవానికి మొగ్గు చూపేవాడే అసలైన మనిషి.
ఈ జీవిత కథ చదివేంత వరకు రాజేశ్వర రావు గారిలోని ఈ కోణం తెలిసిన వారు కొద్దిమందే. ఈ జీవిత కథ తెలుగు పాఠకులకు ఈ కోణాన్ని అందిస్తుందనీ, ఈ జీవిత కథ నుండి తెలుసుకోవలసింది చాలా ఉందనీ అర్థమవుతుందనుకుంటాను. ఆత్మకథ తన కోసం కాదు, దాని నుంచి గుణపాఠాలను నేర్చుకునే వారి కోసం, విలువలను గ్రహించి తమ జీవితాలను మలచుకునే వారి కోసం. ఒక్కొక్కసారి ఆత్మకథా రచయిత తన మనోభారాన్ని దించుకోవడానికో, సంజాయిషీలు ఇచ్చుకోవడానికో, తన సాఫల్య వైఫల్యాలకు ఇతరులనో, సమాజాన్నో,
విధినో బాధ్యులను
చేయడానికో రచన చేయవచ్చు. సాధారణంగా సాఫల్యమయితే తనది, వైఫల్యమయితే పరులది.
రాజేశ్వర రావు గారి ఈ ఆత్మకథ పలు విధాలుగాపై ధోరణికి భిన్నమైనది. వాస్తవమయినది. చదివిన ప్రతి పాఠకుడూ ఈ విషయం గ్రహించగలడు. ఈ పుస్తకం రాజేశ్వర రావు గారి కోసం కాదు, మన కోసం. ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసికోవడానికీ, మన జీవితాన్ని దిద్దుకోవడానికి ఆత్మకథ ఉపయోగపడినప్పుడు దాని
సార్థకత.
రాజేశ్వర రావు గారు ఈ విధంగా తన కథను చెప్పుకొని మన అవగాహనను పెంచినందుకు ఆయనకు
ధన్యవాదాలు.
- దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
(తెలుగు భాషా పండితుడు శ్రీ డి. చంద్రశేఖర్
రెడ్డిగారి పేరు తెలుగు సాహితీలోకంలో తెలియని వారు లేరు. పేరెన్నికగన్న ప్రచురణ
సంస్థ ఎమెస్కోలో గత రెండు దశాబ్దాలుగా ఆయన... ఎన్నదగిన ఎన్నో
వందల పుస్తకాలకు పురుడుపోసారు. ఎందరో ప్రముఖ, వర్ధమాన రచయితలు, కవులు, సాహితీవేత్తలకు
వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆయన సాధారణంగా ఏ పుస్తకానికీ ముందుమాట రాయరు. ఆ
అదృష్టం నాకు దక్కింది. నిష్కపటి. దశాబ్దాల బోధనా అనుభవంతో అయిఉండవచ్చు... ఆయన చెప్పదలుచుకున్న
విషయాన్ని తరతమ భేదం లేకుండా నిర్మొహమాటంగా, సూటిగా చెప్పడం ఆయన తత్త్వం. అదే ఆయన
విశిష్టత కూడ)
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద దొరుకుతుంది.
గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN Post ద్వారా అయితే... అసలు ధరకే లభిస్తుంది.
యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు
పుస్తకం అసలు ధర మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ
స్పష్టంగా వారి పేరు, పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో
Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.........


Comments
Post a Comment