అధినాయక జయహే......
వాడ్రేవు చిన వీరభద్రుడు గారు ... కథ, నవల, కవిత్వం, వ్యాసాలు, అనువాదాలు, పుస్తక సమీక్షలవంటి వైవిధ్యమైన పంటలను ఇబ్బడిముబ్బడిగా పండిస్తున్న నిత్య సాహితీ కృషీవలుడు. భారతీయ సాహిత్యాన్ని ఆపోశనపట్టడమే కాక, ప్రపంచ సాహిత్యాన్ని కూడా జీర్ణించుకున్న అగస్త్యుడు . మల్లెలు, మందారాలు, పారిజాతాల పూదోటలో గడ్డిపూల బొమ్మవంటి నా తొలి కవితల సంకలనాన్ని (అధినాయక జయహే) సయితం గుర్తించి, విశిష్టమైన సర్టిఫికేట్ ప్రదానం చేసిన ప్రతిష్ఠాత్మకమైన ఒక విశ్వవిద్యాలయం లాంటి వాడ్రేవు చినవీరభద్రుడిగారికి..... మనఃపూర్వక నమస్కారాలతో.....
- చినవ్యాసుడు
శుభ్రవాక్కు
మనుషుల్ని కవిత్వం సాధారణంగా వారి యవ్వన దినాల్లో ఆవహిస్తుంది. పసితనపు అమాయకత్వం ఇంకా వీడిపోని రోజుల్లో, మరొకవైపు ఏదో ఒకటిచేసి చుట్టూఉన్న ప్రపంచాన్ని ఎంతో కొంత మార్చాలనే ఉడుకురక్తం ఉరకలెత్తే యవ్వనంలో మనుషులు తమ ఊహల్నీ, ఉద్వేగాల్నీ కవిత్వంగా మలుస్తుంటారు. అది తోటి మనిషికి అమృతాన్ని పంచి పెట్టాలనుకునే ప్రణయ కవిత్వమైనా లేదా సంఘంపట్ల నిప్పులుకక్కే అసమ్మతి కవిత్వమైనా యవ్వనోద్రేకంలోనే ప్రభవించడం సర్వసాధారణం.
కాని ఇప్పుడు మీచేతుల్లోఉన్నచినవ్యాసుడు రాసిన
కవిత్వం ఇందుకు మినహాయింపు. అసాధారణం. ఆయన తన యవ్వన దినాల్లో పత్రికాఫీసుల్లో ఏ రోజు
వార్తలు ఆరోజుకి ప్రపంచానికి అందించే పనిలో తలమునకలై గడిపేరు. ఇప్పుడు జీవితం ఒకింత వ్యవధి ఇచ్చాక, ఇన్నాళ్ళుగా తనగుండెల్లో అదిమి పెట్టుకున్న భావోద్వేగాల్ని
ఇలా కవిత్వంగా మార్చి మన చేతుల్లో పెడుతున్నారు.
Poetry is news that
stays news అనిఎజ్రాపౌండు (20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతుడైన కవి, విమర్శకుడు) అన్నాడని మనకు తెలుసు. కవిత్వంకూడా వార్తాప్రకటనే గాని, అది వార్తల్ని దాటిన వార్తాప్రకటన. మనం రోజూ పత్రికల్లో చదివే వార్తలు నిర్దిష్ట
ఘటనలకి సంబంధించిన నివేదికలు. కాని ఆ
ఘటనల వెనక ఎప్పటికీ శమించని మానవోద్రేకాలు, కాంక్షలు, భయాలు, ప్రేమలు, మమకారాలు – వాటిని
పట్టుకునేదే కవిత్వం. కాబట్టే, పత్రికల్లో వచ్చే పతాక ప్రకటనలు మరుసటి రోజుకల్లా తమ ప్రాధాన్యతని
పోగొట్టుకుంటాయి గాని, ఇదుగో, ఈ పుస్తకంలో కనిపించే ఇటువంటి వాక్యాలు ఎప్పటికీ వెలుగుతూనే
ఉంటాయి:
దీపం ఒక్కటే దీపావళి కాదు
నేను ఒక్కడినే ప్రపంచం కాదు.
ఈ సంపుటంలోని అరవై మూడు కవితలను నేను చాలా ఆశ్చర్యంతో
చదివాను.
ఈ కవితలన్నిటి లోనూ నన్ను నివ్వెరపరిచిన విషయం, ఈ కవి హృదయంలో ఇంకా ఇంత పసితనం, ఇంకా ఇంత ఉద్వేగం, ఇంత తాజాగా ఎలా ఉన్నాయా అని. అదీ ఇన్నేళ్ళు పత్రికల్లో పనిచేసాక, ప్రపంచాన్ని ఇంత దగ్గరగా చూసాక, మనుషుల్లోని చీకటి నీడల్ని ఇంత దగ్గరగా సహించాక – ఇంకా ఈయన ప్రపంచంపట్ల తనలోని ఈ శుభాకాంక్షని
ఎలా కాపాడుకోగలిగాడని అడుగడుగునా ఆశ్చర్యపడుతూ చదివాను. లోకమిట్లానే నడుస్తుందిలే అని తనకుతాను సర్దిచెప్పుకునే వయస్సులో
లోకమిలా ఎందుకుండాల అని అమాయికంగా ప్రశ్నించే ఈ పసితనంకన్నా గొప్ప భాగ్యం మరొకటి ఉంటుందనుకోను. ఈ సంపుటానికి రాసుకున్న తొలి పలుకులో ఆయన ఇలా
అంటున్నారు:
‘‘నా విషయానికొస్తే..జర్నలిజం వృత్తి మధ్యలో విరామం దొరికినప్పుడు.. అంటే నేను నిరాయుధునిగా ఉన్నప్పుడు..చేతిలో గండ్రగొడ్డలి లేనప్పుడు .. సూదులుగా, చాకులుగా చేసుకుని వదిలిన నాకవితలు నా మనసును కుదుట పరుస్తుంటాయి.’’
అటువంటి మనఃస్థితిలోంచి వచ్చే ఏ వాక్యమైనా ఆ
నిజాయితీవల్ల చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఉదాహరణకిఈవాక్యంచూడండి:
‘నేను’ ఏకవచనంకాదు, నాకు
‘భార్యాబిడ్డలు’ ఏకవచనమే.
ఎటువంటి ప్రలోభాల్నీ ఆశ్రయించని మనసు ఏ మాట పలికినా
ఆ వాక్యం తప్పకుండా కవిత్వమవుతుంది. ఇదుగో, ‘ఆత్మలింగం’ అనే కవితలోని
ఈవాక్యంలాగా:
శివా! నిన్నిలా చూస్తుంటే
నా మనసు కుదుటపడుతున్నది.
చినవ్యాసుడిగారి జీవిత ప్రయాణం అసాధారణమైంది. అటువంటి సంఘర్షణ తరువాత మరొకరెవరేనా లోకాన్ని శాపనార్థాలతో ముంచెత్తుతారు. కాని ఆయన ఈ కవిత్వం ద్వారా శుభాశీస్సుల్తో ముంచెత్తుతున్నారు. ఇటువంటి వారు మసిలినందువల్ల మన ప్రపంచం మరింత
శుభ్రపడుతుందని మనం నిస్సంకోచంగా నమ్మొచ్చు.
- వాడ్రేవుచినవీరభద్రుడు


Comments
Post a Comment