స్థావర జంగమ కవికి స్వాగతం
ఒకానొక నిజ పాత్రికేయుడు కవిగా గమిస్తే ఎటువంటి
కవిత్వం జనిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి చినవ్యాసుడి కవిత్వం చదవడం ఒక
అపురూపమైన అనుభవం. నిలిచిపోయే అనుభవం. మహా ఇతిహాసం రాసిన వ్యాసుడు కవిగా అవతరించడం
ఇక్కడ విశేషం.
వ్యాసుడు చినవ్యాసుడిగా రూపుదాల్చినందువలన సంభవించిన
వేళావిశేషం.
పాత్రికేయ వృత్తినుంచి తీసుకున్న
విరామం ఈ కవన సృష్టికి సావకాశం కల్పించింది. క్రియాశీల పాత్రికేయునిగా నిర్వహించిన యథార్థవాది పాత్రనే కవిగా కూడా నిర్వహించడం
వలన, ఈ కవితా శకలాలు పదునుదేరి ఉన్నాయి. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిండారా ప్రతిఫలిస్తున్నాయి. లౌకిక జీవన దృక్కోణాన్ని పుక్కిటపట్టాయి. వర్తమాన భారత సంక్షుభిత సమాజ చిత్రాన్ని కనుల
ముందుంచాయి.
ఆ విధంగా ‘‘అధినాయకజయహే’’ పేరిట
వెలువడుతున్న ఈ చిన్ని పొత్తంలో మీరు చదవబోతున్నది పూర్తి నిడివి రాజకీయ కవిత్వం. సమాజ జీవనంలో రాజకీయ స్పర్శలేని అంశం ఉండే అవకాశం
లేదు ఉండదు. ఎక్కడైనా
ఇదే విధంగాఈ కవనంఇందుకు సాక్ష్యం పలుకుతున్నది:
“కవిత్వం నా దృష్టి లో ఒకానొక బలహీనత’’ అన్నాడు కవి తన ‘నామాట’లో. కానీ ఆ ‘బలహీనత’ ఆచరణలో
బలంగా నిరూపితమైంది. బలీయంగా ముందుకొచ్చింది. వేదనాపూరిత స్వరంగా నిగ్గుదేరింది; ధర్మాగ్రహ ప్రకటనకు వేదికగా నిలిచి అక్షరాయుధంగా
ఒక్క ఉరుము ఉరిమింది. తద్వారా పాఠక హృదయ స్పందనకు పూచీ పడుతున్నది. ఇందులోని 64 కవితలు సమాజ గమనంలో ఇమిడివున్న భిన్నవిభిన్న పార్శ్వాలపై
వెలుతురును ప్రసరిస్తున్నాయి. ‘‘అక్షరాలన్నీ
డస్టర్తో తుడిచేసిన ఒకబ్లాక్ బోర్డు’’ (మౌనం) ఈ కవన కదంబానికి నాందీప్రస్తావన పలకడం గమనార్హం. మౌనంలో దాగివున్న భాషలు, పరిభాషలు, రూపాలు, రూపకాలు, బహుళ రూపారూపాలు
మన ముందుంచే ‘మౌనం’ (కవిత) పంచ భూతాలకు
పరిచయం లేని/ప్రకృతి ఎరుగని అనుభవం’’ కూడా కావడంపాఠకుణ్ని విస్మయపరుస్తుంది. అనిర్వచనీయమైన మౌనాన్ని ఇన్నిన్ని విధాల నిర్వచించడం
అబ్బురపరుస్తుంది. చినవ్యాసుడి దార్శనిక స్ఫూర్తికి నిలువెత్తు
నిదర్శనంగా నిలుస్తుంది.
ఒక పౌరునిగా, బాధ్యతగల పౌరునిగా, పౌరత్వం ఈనాటికీ పుణికి పుచ్చుకోలేక పోయిన/ పోతున్న
ప్రజలు/ సామాన్య ప్రజలపక్షం వహిస్తూ ఈ కవి తన కవితలను
పాఠక లోకానికి అందించారు. భారత రాజ్యాంగం
కులమతాలకు
(భక్తి భావన సహా) ఎందుకు, ఏవిధంగా అతీతమైనదో ‘నాపబ్లిక్ - నారిపబ్లిక్’ కవితలో నిశితంగా అక్షరబద్ధం చేశాడు. ప్రశ్నించడమే మహాపరాధంగా పరిణమించిన తీరును ప్రశ్నిస్తూ, నిత్యసత్యాలుగా చలామణిలో ఉన్న కొన్ని అపభ్రంశాల
అసలు రంగు బయటపెట్టిన సందర్భాలు ఈ కవిత్వంలో మీకు తారసపడతాయి. వేమన, కబీర్ వంటి మహాతత్త్వ కవుల మార్గం తొక్కడం మూలంగా ఈ సురుచి
కవికి అబ్బిందని నాఊహ.
విద్యాధిక మధ్యతరగతి మందభాగ్యుల
జీవితాలలో కమ్ముకొన్న కారుచీకటిని, విలువల
లేమిని యథాతథ/ యథాపూర్వ
సంకుచిత స్వార్థపరత్వాన్ని, డొల్లతనాన్ని
ఎండగట్టడంలోఈ కవి ముందున్నాడు. సంసార జీవితంలోనే కాకుండా, సమాజ జీవనంలో సైతం మధ్యతరగతి అవలంబిస్తున్న ‘స్వీయ మానసిక ధోరణి’ని బట్టబయలుచేశారు. ‘జ్ఞాపకాలు జారిపోతున్నాయి’, ‘ప్రవర వరుస మారరాదు’ వంటి కవితలు ఇందుకు అద్దం పడతాయి. మధ్యతరగతి శ్రేణుల్లోఉన్న అభ్యుదయ, మతతత్త్వవాదుల నిజరూపాలను కవి నిర్ద్వంద్వంగా, నిరలంకారంగా ఆవిష్కరించడం ఈకవిత్వంలో మనం చూస్తాం. మేధావులుగా ఊరేగే సోకాల్డ్ అభ్యుదయవాదుల, ప్రగతికాముకుల నిష్ర్కియాపరత్వాన్ని బహిరంగం
చేసిన ఘాటైన కవిత ‘శేషంసున్న’ నివారింప వీలుకాని మీ అసహనాన్ని మిన్నంటించేలా
చేస్తుంది.
మనల్ని అనునిత్యం ఇంటాబయటా
రిమోట్ కంట్రోల్ చేసే అసామాజిక శక్తులపై లోతుగా
ఫోకస్ చేసిన
‘ఇదీ నా సోషల్ స్టేటస్’ అనే కవిత మిమ్మల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. హీనపక్షం సమాజ గమనంపై మీ దృష్టిని సునిశితం చేస్తుంది. వయసు మీరిన కవులు కొందరు ఆ మధ్య ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కామ ప్రేరిత వికృత కవిత్వాలను వండివార్చడాన్ని ‘పెద్దలకుమాత్రమే’ కవిత దునుమాడుతుంది. ఆ అదృశ్య పురుష/ కవి పుంగవులను
దండిగా శిక్షిస్తుంది.
‘‘మీడియా చేతిలో ఉన్నది వ్యాపారమే, సత్యసంధతా కాదు పత్రికా స్వేచ్ఛా కాదు’’ అంటూ కరకు వాస్తవాన్ని వెల్లడించిన కవిత ‘అధినాయక జయహే’-ఇతర అన్ని జీవిత రంగాలలో పాతుకు పోయిన అసత్యాలను తూర్పారపడుతుంది. చాలినంత వ్యంగ్యంతో చినవ్యాసుడు రాసిన అధిక్షేప
కవిత్వం ఈ సంకలనం లోని అనేక కవితలలో మీరు చూస్తారు. ‘క్షేత్రేక్షేత్రే ధర్మంకురు....’ కవి ప్రయోగించిన కటువైన వ్యంగ్యానికి బలమైన తార్కాణం.
“ఇంటి దొంగలను కూడా/పట్టించుకోనిఈశ్వరులం’’. ఈ చరణం మన దేశ వర్తమాన రాజకీయ పరిస్థితి పైనే
కాకుండా దేశ పౌరుల అలసత్వంపై కూడా కటువైన వ్యాఖ్య. ‘నాదేవుడు’ కవితలో
వ్యంగ్యం వెల్లువెత్తిన వైనం చూస్తాం.
కరోనా కాలాన్ని ఒడిసి పట్టిన
కవిత
‘అస్తమయాన ఉదయం’. ‘‘ఎక్కడో ఒకచోట మొత్తానికి/ సర్వమానవ
సమానత్వం వచ్చేసింది’’ అని ప్రకటించే ఈ కవిత కరోనా
కాలంలో పేట్రేగిన అకృత్యాలపై ఆస్పత్రుల లీలలపై ప్రసరించిన టార్చిలైట్ అంటాను. లాక్డౌన్ విధించిన పాడు రోజుల్లో వలస కార్మికులు కాలినడకన వెనక్కి
తమతమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వేళ మానవత్వం వికసించిన తీరును ‘దేశభక్తి’ కవిత చిత్రిక పట్టింది.
‘అదీ చేస్తాం.... ఇదీ చేస్తాం’, ‘ఏక్ నిరంజన్’, ‘పొలిటికల్
హాలిడే,
‘ఊపిరి అందడం లేదు’, ‘ఓం శాంతి; శాంతి; శాంతి!’, ‘వర్క్
ఫ్రం హోం’ కవితలు నిత్య జీవితంలో నెలకొన్న అసమంజసత్వాన్ని
ఎక్స్పోజ్
చేస్తాయి. కరోనా శకపురుషుడి ‘భవిష్యన్నినాదం’ అసలు సంగతిని మీముందు ఉన్నదున్నట్లు ఉంచుతుంది. వాస్తవ జీవితం, జీవిత వాస్తవం మునుముందు ఎంత భయానకం కాబోతున్నాయో కళ్ళకు
కడుతుంది ఈ
11 చరణాలచిన్ని కవిత. ‘‘చచ్చినసిగ్గునుబొందపెట్టాల్సిన/శ్మశానాలుకూడా/సిగ్గుతోచచ్చిపోతున్నాయి/’’ (సిగ్గు) ఈ వాక్యాలు
కరోనా ఎంతటి మహమ్మారో చెప్పకనే చెబుతాయి. సిగ్గులేని
మనిషిని ఆవిష్కరిస్తాయి.
తన కవిత్వమంతా ‘వస్తువు’ను ఆశ్రయించి రాసిన చినవ్యాసుడు, ‘ఆత్మ’ను ఆశ్రయించి చిట్టచివర్న
రెండు కవితలు రాయడం విశేషం. అవి ‘ఆత్మలింగం’, ‘సంధ్యా... వందనసమర్పణం’. కవి అంతస్సును
వెలిగించిన ఈ రెండు కవితలు- ఆత్మాశ్రయ
మార్గంలోఈ కవి కవితా వ్యవసాయం కొనసాగిస్తే, లోతైన తత్త్వకవి పుట్టుకను హామీ ఇస్తున్నాయి. చినవ్యాసుడు పాత్రికేయకవి (Journalist as a
poet) రూపంలో సారవంతమైన కవిత్వాన్ని పాఠకలోకానికి
అందించడం కేవలం విశేషం మాత్రమే కాదు, అత్యంత
అరుదైన విశేషం అంటాను. రోజువారీ వార్తాప్రసారంలో, ప్రవాహంలో కొట్టుకుపోయే పాత్రికేయుడు కొద్దిగా
ఓ పక్కకు జరిగి నిలిచి కళ్లముందు కదులుతున్న/ కదిలిపోతున్న ప్రపంచాన్ని లోచూపుతో తిలకిస్తే స్థావర జంగమ
కవిత్వం అనివార్యంగా ఆవిర్భవిస్తుందని చినవ్యాసుడి సందర్భం నిరూపించింది.
ఇదిఒకకొత్తఒరవడి, ఉరవడి. ఇందుకుగాను నా చిరకాల మిత్రుడిని కవన లోకంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ
ఈనాలుగుమాటలు.
పాఠక లోకంలోకి ప్రవేశార్హత పొందిన ఈ కవి సార్థక
నామధేయుడు.
ఏకకాలంలో పండితారాధ్యుడు, పామరారాధ్యుడు.
- అసుర
(అసుర- అంబటి సురేంద్ర రాజు- బహుముఖ ప్రజ్ఞావంతుడు. బడుగు, బలహీనవర్గాల గొంతును విస్తృతంగా వినిపించడానికి శతథా తపించే సీనియర్ జర్నలిస్టు. అసుర-పేరుతో కవితలు, సాహిత్య వ్యాసాలు, విశ్లేషణలు, అనువాదాలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు అనేకం చేసారు. మంచి చదువరి, ఎటువంటి భేషజాలు, దాపరికాలు లేకుండా అందరికీ ఆత్మీయత, అనురాగాలు పంచే స్నేహశీలి. ప్రజాదరణ పొందిన హోమియో డాక్టరు.)
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద దొరుకుతుంది.
గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN Post ద్వారా అయితే... అసలు ధరకే లభిస్తుంది.
యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు
పుస్తకం అసలు ధర మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ
స్పష్టంగా వారి పేరు, పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో
Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.........


Comments
Post a Comment