ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి ఇది

 



నేను బహువచనంఆసక్తికరంగా చదివించే లక్షణం పుష్కలంగా కలిగిన పుస్తకం. 

ఇది ఒక జర్నలిస్టు జీవిత చరిత్ర అనడం కన్నా ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి అనడం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. జర్నలిస్టుగా ప్రారంభించిన జీవితం కొన్ని మజిలీలలోనే కాస్తంత నిలకడగా సాగుతుంది. ఈనాడులో పని చేసిన కాలం చెప్పుకోదగినది. ఈనాడులో ప్రవేశించే ముందు అప్పటి ఆంధ్రప్రభసంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావుతో మాట్లాడిన లేదా మాట్లాడని తీరు ములుగు రాజేశ్వరరావు వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. అహంకారం కాదు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపిన దురుసుతనం మొదటి నుంచి ఇప్పటి దాకా ఆయనలో కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణం.

సబ్-ఎడిటర్ గా ఉంటూనే పేజీలు పెట్టించడం, ఎడిషన్ల పని చూసుకోవడం వంటి పెద్ద బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనది. ఆంధ్రపత్రికలో చేసిన విన్యాసాలు, పత్రికాప్రపంచంలో పోయిన పోకడలూ ఆయనను ఒకానొక అరుదైన జర్నలిస్టుగా నిలబెడతాయి. జర్నలిజం వీడిన అనంతరం చేసిన అనేకానేక ప్రయోగాలూ, వెబ్ సైట్లూ, డిజిటల్ మీడియాలో ఎత్తుగడలూ,  ఆయనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలూ  అసాధారణమైనవి. అన్ని వైవిధ్యభరితమైన రంగాలలో ప్రావీణ్యం కలిగి ఉండటం, అన్ని పెద్ద సంస్థలు ఆయనతో కలిసి పని చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించడం, మైక్రోసాఫ్ట్, సత్యంరామలింగరాజు వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం చాలా అరుదుగా కలిసివచ్చే అవకాశాలు. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా గుండె చెదరకుండా సమధికోత్సాహంతో కొత్త ప్రతిపాదనలు చేయడం, కొంగ్రొత్త కలలు కనడం, పర్వతాలను ఢీకొనడానికి ఏ మాత్రం వెరవకపోవడం రాజేశ్వరరావు వ్యక్తిత్వ విశేషాలు.

జర్నలిస్టులలో అత్యంత సునిశితమైన పాత్ర పోషించిన వ్యక్తిని నేనే అన్న అభిప్రాయం ఇంతవరకూ నాకు ఉండేది. ఎందుకంటే చేతితో అక్షరాలు కంపోజ్ చేసే రోజులలో 1976లో బెంగళూరులో ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ ట్రయినీగా చేరి, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి పత్రికల సంపాదకుడిగా పని చేసి, హెచ్ఎంటీవీ న్యూస్ చానెల్ ను స్థాపించి, నిర్వహించి, ద హన్స్ ఇండియా అనే ఇంగ్లీషు పత్రికను నెలకొల్పి, దానికి చీఫ్ ఎడిటర్ గా పని చేసి, చివరలో సాక్షిదినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా చేసి, ఉద్యోగ విరమణకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన నేను అత్యంత వైవిధ్యభరితమైన వృత్తి జీవితం గడిపిన వ్యక్తిగా పరిగణించాను. 

నేనూ, రాజేశ్వరరావుగారూ జర్నలిజంలో ఉన్నప్పటికీ మేము ఎక్కడా కలిసి పని చేసిన సందర్భం లేదు. కానీ ఆయన జీవిత విశేషాలు తెలుసుకున్న తర్వాత ఆయన జీవితసమరంలో ఉన్న పోరాట స్ఫూర్తి, ప్రయోగశీలత, సాహసం, కొత్త ఆలోచనలను అమలు చేసే తెగువ, ఎంత పెద్ద సంస్థతో అయినా, ఎంత పెద్ద వ్యక్తితో అయినా సమాన ఫాయిదాపైన వ్యవహరించే సంయమనం, మనోబలం అనితర సాధ్యమైన లక్షణాలు. ఆయన జీవితంలో విలువైన స్నేహితులు ఉన్నారు. కొత్తగా పరిచయమైనవారు సైతం ఆయనతో స్నేహం పెంచుకొనేవారు. ఎంత క్లిష్టమైన పనినైనా సరే సకాలంలో పూర్తిగా చేయగల నేర్పూ, పట్టుదలా ఆయనకు దండిగా ఉన్నాయి.

టీవీ, వీడియో, ఆడియో, ఎలక్ట్రానిక్ రంగాలలో తాను ఒక కేటలిస్టుగా పని చేసినట్టు, తన కొరకు కాకుండా ఇతరులకు ఉపయోగపడినట్టుగా గ్రహించారు. కానీ చింతలేదు. ఎప్పుడైనా తన వల్ల ఇతరులు నష్టపోకూడదనే భావనే ఆయనను నడిపించింది.  జీటీవీ సుభాష్ చందర్, డెవిల్స్ అడ్వకేట్ కరణ్ థాపర్ వంటి దిగ్గజాలతో వ్యవహారం చేయడం, టెలివిజన్ పత్రికను కొత్త పుంతలు తొక్కించడం, దాన్ని బతికించడానికి సరికొత్త ఆలోచనలు చేయడం, వినూత్నమైన ప్రతిపాదనలను అమలు చేయడానికి సాహసించడం విశేషం. ఆదాయం బొటాబొటిగా ఉన్న కాలంలో, నిలకడైన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేని దశలో, ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలమీద మోస్తున్న సమయంలో, బ్యాంకు బ్యాలెన్స్ భయపెడుతున్న సందర్భంలో ఇన్ని ప్రయోగాలు చేయడం గమనార్హం.

జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి, ఒక వైపు నిత్యసంఘర్షణలలో మునిగితేలుతూనే పిల్లల చదువుసంధ్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. పెద్ద కొడుకు రోహిత్, కోడలు శ్రుతి పోలెండ్ లో, చిన్న కొడుకు అభిజిత్ అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. తానూ, భార్య హైదరాబాద్ లో నివసిస్తూ ఇంగ్లీషు, హిందీల నుంచి తెలుగులోకీ, తెలుగు నుంచి ఇంగ్లీషులోకీ పుస్తకాలను తర్జుమా చేస్తూ నిశ్చింతగా జీవిస్తున్నారు. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు విస్మరించలేదు. జీవితం నేర్పిన పాఠాలను మరువలేదు. ఆర్ ఎంపీ వైద్యుడుగా పని చేస్తున్నతన  తండ్రి తాను కాయ్ రాజా కాయ్ ...అణాకు అణా, బేడకు బేడా..అంటూ అరవడం విని, తనను చితకబాదిన సందర్భం మరచిపోలేదు. అప్పుడు కూడా తండ్రిమీద కోపం రాలేదు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని అనుకున్నారు. జీవితంలో తారస పడిన అనుభవాలను అర్థం చేసుకున్నారు. ముందుకు సాగిపోయారు. 

పదో తరగతి వరకూ సముద్రతీరంలో ఆడుకున్నారు. తర్వాత సముద్రంతో ఏమాత్రం సంబంధం లేని హైదరాబాద్ మహానగరంలో జీవితంలో అనేక ఘర్షణలతో సతమతమై, పాము- నిచ్చెన ఆటలో పాము నోట పడినా అపజయాన్ని అంగీకరించకుండా మళ్ళీ నిచ్చెన ఎక్కుతూ,  తిరిగి పామునోట పడుతూ, మరోసారి నిచ్చెన ఎక్కుతూ అవిశ్రాంతంగా పోరాటం చేసిన  అనంతరం విరామం తీసుకొని జర్నలిజానికి మరో పార్శ్వమైన అనువాదరంగంలో పని చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. వారికి అభినందనలు. శుభాకాంక్షలు.

సంచలనాత్మకమైన జీవితాన్ని అలవోకగా, ఆలోచనాస్ఫోరకంగా, ఆవేశరహితంగా, కవితాత్మకంగా రచించిన మిత్రులు ములుగు రాజేశ్వరరావు తాను విశ్వసించిన విలువలకు ఆద్యంతం కట్టుబడి జీవించిన వ్యక్తిగా, కుటుంబసభ్యులను అమితంగా ప్రేమించిన ప్రేమాస్పదుడిగా, తల్లి ప్రేమను తనివితీరా అనుభవించిన కుమారుడిగా, సంతానాన్ని బాగా చదివించి వారి ఉన్నతికి దోహదం చేసిన బాధ్యతగల తండ్రిగా, భార్యను గౌరవించే భర్తగా,  జీవితాన్ని ఫలప్రదంగా నడుపుతున్న మనీషిగా ఈ పుస్తకంలో దర్శనమిస్తారు. ఉన్నది ఉన్నట్టు అందరికీ అర్థం కావడానికే, సరళంగా రాయడానికే తన రచనా ప్రావీణ్యాన్ని ఉపయోగించారు కానీ లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ భ్రమింపజేయడానికి, భేషజాలు పోవడానికి మాత్రం కాదు. నీతిగా, నిజాయితీగా, నికార్సుగా రాసిన జీవిత చరిత్ర ఇది.

 

... కె. రామచంద్ర మూర్తి

సీనియర్ ఎడిటర్

.........


(నేను-బహువచనం, 220 పేజీలు, రు.180)

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పుస్తక విక్రేతలవద్ద  దొరుకుతుంది.

గ్యాన్ (బుక్) పోస్ట్ -GYAN  Post ద్వారా అయితే...   అసలు ధరకే లభిస్తుంది.

యూటిఐ పేమెంట్ యాప్ ద్వారా 9866312323 నంబరుకు

పుస్తకం అసలు ధర  మాత్రం చెల్లించి రసీదు ఇదే నంబరుకు వాట్సాప్ లో పంపుతూ  

స్పష్టంగా వారి పేరు,  పూర్తి చిరునామా టెలిఫోన్ నంబరు తెలియచేయాలి


ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో 

Sahithi Prachuranalu వంటి వెబ్‌సైట్‌లలో లభిస్తుంది.

 ........

(మీ అభిప్రాయాలు... ఈ కింద ఉన్న కామెంట్ బాక్స్ లో ...Enter Comment... అని ఉన్న చోట... పెడితే అందరూ చూస్తారు... ఈ బ్లాగులో కూడ శాశ్వతంగా ఉండి... తెరిచిన ప్రతిసారీ అలరిస్తుంటాయి.)


Comments

Post a Comment

Popular posts from this blog

...కన్నులు చెలమలయ్యాయి

అధినాయక జయహే... కవితా సంకలనం... సమీక్ష

అతడొక సముద్రం!

It reminded me of my life...

మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా......

పుస్తకాల ప్రచురణ వ్యాపారమా !!!

తెలుగు పుస్తకాన్ని చంపుతున్నది ఎవరు ?