మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా......

 


రోగం ఎక్కడ ? చికిత్స ఎక్కడ ?


విద్యారంగం అభివృద్ధి చెందేలా చేయడానికి, జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేయడానికి అంకురార్పణ ఎక్కడ జరగాలి.... పాఠశాలలు, గురుకులాలు, విద్యాసంస్థలు, యూనివర్శిటీలకు వేలకోట్లు కేటాయించడంతో కాదు....అదీ అవసరమే కానీ దానికంటే ముందు ప్రాధాన్యత... పుస్తకాన్ని బతికించుకోవడం. కావాలనుకున్న పుస్తకం అందుబాటులో లేనప్పుడు, అంగలార్చినా దరిదాపుల్లో ఎక్కడా దొరకనప్పుడు విద్యారంగం మీద ఎన్ని కోట్లు కుమ్మరించి ఏం ప్రయోజనం ? 

అందుకే మోడీ అయినా(జాతీయ విద్యా విధానం ద్వారా ), రేవంత్ రెడ్డి (విద్యాశాఖను ఆప్యాయంగా తనవద్దే ఉంచుకోవడం ద్వారా) అయినా ఓ ప్రథమం చేయాల్సింది...   పుస్తకాన్ని  మారుమూల పల్లెనుంచి, రాజధానిలోని ప్రతి గల్లీవరకు అందుబాటులో ఉంచాలి. అంటే ఏం చేయాలి... ??? ప్రత్యేకంగా చెమటోడ్చాల్సిన పనేమీ లేదు. ఇప్పటికే మంచమెక్కిన  గ్రంథాలయ వ్యవస్థకు జవజీవాలు అందించాలి.  ఇప్పటివరకు గ్రంథాలయాలకు నైవేద్యంగా వందలకోట్ల రూపాయలు పెట్టినట్టు చూపి, ఆ సొమ్మును ప్రసాదంగా కళ్ళకద్దుకుని  గంపగుత్తగా రాష్ట్ర బడ్జెట్లో కలిపి సంతర్పణ చేసే విధానానికి స్వస్తి పలకాలి.


అంటే...????

లైబ్రరీ సెస్సు అని ఒకటి ఉంటుంది. దీనిని ప్రజల నుండి ఆస్తిపన్ను, తదితర పన్నులలో భాగంగా వసూలు చేస్తారు. వీటిని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల వంటి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి.  ఈ నిధులతో ఆయా ప్రాంతాలలోని పౌర గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం. ఏ రాష్ట్రంలో లేనంతగా  ఉమ్మడి రాష్ట్రంనాటి నుంచే దీనిని 8% చొప్పున వసూలు చేసారు. కానీ 2015 తరువాత... అంటే రాష్ట్రం విడిపోయి కొత్తగా తెలంగాణ ఏర్పడిన ఏడాది కాలంలోనే ఈ నిధుల నియంత్రణను రాష్ట్ర ఆర్థిక శాఖకు అప్పగించారు. అంతే ...ఆ రోజు నుండి రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు గొంతులెండి పోతున్నాయి, ఆకలితో మలమలమాడిపోతున్నాయి.

దీనికి తోడు రాష్ట్రంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలను 23 జిల్లాలకు పెంచారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వాటికి తగ్గట్లు ఏర్పాటవుతున్నా, గ్రంథాలయాల పరిస్థితి మాత్రం దిక్కుదివాణం లేకుండా ఉంది. ఇప్పటికిప్పుడు లెక్కలు తీసినా, కనీసంలో కనీసం గ్రంథాలయాలకు జమ చేయాల్సిన నిధులు రు.1500 కోట్ల పైమాటే. అంటే ఇన్ని నిధులు పెట్టుకుని అది ఆకలిచావుకు సిద్ధంగా ఉంది.

ఈ దశలో రాజకీయ పదవుల భర్తీలో భాగంగా  గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గా డా. మహ్మద్ రియాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. లైబ్రరీ సైన్స్ వంటి సంబంధిత శాఖాపరమైన అర్హతలు, యోగ్యతలతో ఆయన ఈ పదవిని అలంకరించారు... అయినా  ఏం లాభం !!! ఆయన చేతులు, కాళ్ళు కట్టి పడేసి గ్రంథాలయ పరిషత్ ను ఈదమంటున్నారు.


డా.మహమ్మద్ రియాజ్ : 

ఛైర్మన్, స్టేట్ లైబ్రరీస్, తెలంగాణ


ఆయనను  పలకరిస్తే...

‘‘మాకు రావాల్సిన నిధుల్లో ఏ కొంత ఇచ్చినా... వెంటనే ఊరూరా కాకపోయినా, ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో , కొత్త పుస్తకాలతో, అతి కొద్ది వ్యవధిలోనే మొత్తం వ్యవస్థను పాఠకులకు అందుబాటులో ఉంచుతాం.  ఆ నెట్ వర్క్ ఇప్పటికే ఉంది. దానిని బలోపేతం చేయాలి. విస్తరించాలి అంతే. మంచి నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా ఉన్నారు. చదివే పాఠకులు తండోపతండాలుగా ఉన్నారు’’

‘‘ఇంత సంక్షోభంలో కూడా రాష్ట్రంలో అక్కడక్కడా అధునాతన సాంకేతికతో డిజిటల్ లైబ్రరీలు నడుపుతున్నాం. మాకు చేతిలో గవ్వలు గలగలలాడితే, మా లైబ్రరీలు విరగపండిన తోటల్లాగా కనిపిస్తాయి. అప్పుడు పాఠకులు చిలకల్లాగా  గుంపులుగుంపులుగా వచ్చి వాలిపోతారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు వారివారి ప్రాంతాల్లోనే ఉంటూ... ప్రిపేర్ కావచ్చు.’’


డి. చంద్రశేఖర్ రెడ్డి : 

సంపాదకులు, ఎమెస్కో



అక్కడే తెలుగును ఆపేసి.....

దశాబ్దాలపాటూ బోధనారంగంలో ఉండి, తెలుగు ప్రాచ్యకళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసి, ఎమెస్కో సంపాదకుడిగా ప్రస్తుతం వందలాది పుస్తకాలకు జీవం పోస్తున్న శ్రీ డి. చంద్రశేఖర్ రెడ్డిగారు ఏమంటారంటే...

‘‘తెలుగు భాషను ఒక సబ్జెక్ట్ గా నేర్చుకునే అవకాశాన్ని పదోతరగతితోనే...లేదా  ఇంటర్ తోనే ఆపేస్తున్నప్పుడు ... కొన్నేళ్లుగా ఇది ఇలాగే అమలవుతున్నప్పుడు కొత్త తరం తెలుగు పాఠకుల రాక కూడా ఆగిపోయినట్లే కదా !!! 30 రోజుల్లో తెలుగు భాష నేర్చుకునే వారికీ, వీరికీ పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇక్కడ తెలుగు భాషగా కాదు, తెలుగు సాహిత్యంలో ప్రవేశం కలుగ చేయాలి. దాని లోతులు కొంతమేరయినా చూపించాలి. తెలుగు నాలుగు కాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ... మున్ముందుగా పాఠశాల, కళాశాల స్థాయిలోనే  దానికి తగిన ఏర్పాటు చేయాలి.ఇది జరగనంతవరకు భాషగా కానీ, సాహిత్యంగా కానీ, సృజనాత్మకతలో గానీ తెలుగు వికసించే అవకాశం ఉండదు.’’

‘‘మరో విషయం.. స్కూలు లైబ్రరీలకు ఒకప్పుడు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉండేది. ఇప్పుడదీ లేదు. ఇటువంటి మౌలిక అవసరాలను తీర్చిన తరువాతే  విద్యారంగం అభివృద్ధికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు ఎన్ని రచించినా ఫలితం ఉంటుంది’’ అన్నారు.


నారాయణ రెడ్డి 

నవచేతన పబ్లిషింగ్


పుస్తకం పాఠకుల దగ్గరకు వెళ్ళాలి. 

స్కూళ్ళలో ఎగ్జిబిషన్స్, మొబైల్ వాన్స్, క్లియరెన్స్ సేల్, బుక్ ఫెయిర్లు ఉండాలి

అవేర్ నెస్ ప్రభుత్వం నుంచి, స్కూళ్ళనుంచి రావాలి

ఉచితంగా పుస్తకాలిచ్చి పిల్లల చేత రీడింగ్ అలవాటు చేయించాలి

2010 వరకు స్కూల్స్ కు లైబ్రరీ బడ్జెట్ ఉండేది. కొన్ని ఏళ్ళుగా  అది లేదు.

బుక్ ఫెయిర్స్ కు సొసైటీ లేదు. ఛాయా లాగా కొత్త బుక్ ఫెస్ట్స్ రావాలి. అయితే సమన్వయం కావాలి.యూనిటీ కావాలి. అది జరగాలని కోరుకుందాం.

  

శ్వేత 

అజూ పబ్లికేషన్స్



అనువాదాలు ఎక్కువగా అకాడమిక్ లెటరేచర్ కే పరిమితం అవుతున్నాయి

పుస్తకాల పంపిణీ యంత్రాంగం సరిగా  లేదు

పాఠకులు ఎక్కువగా సోషల్ మీడియాలో సమీక్షలు  చూసి కొంటున్నారు

పైరసీ తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా ఉంది 

అమ్మ డైరీలో ఒక పేజీ... మొదట ఒక రీల్ కూడా చేయలేదు. పాఠకులు సామాజిక మాధ్యమాల్లో  సమీక్షలు పెట్టిన తరువాత కొత్త పాఠకులు వచ్చారు.

నిస్సందేహంగా పాఠకులున్నారు, వారికి చదవతగిన మెటీరియల్ కూడా ఉంది. దానిని వారికి చేర్చడం ఎలా ? ఎవ్వరికీ తెలియదు.. 

కొత్త రచయితలు, ప్రచురణకర్తలు ఈ మార్గాలు వెతుకుతున్నారు. కొంతవరకు సక్సెస్ బాటలోనే ఉన్నారు వీళ్లంతా.

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ 2 వేలమంది చూస్తారు. వారిలో 20 మంది కొన్నా చాలు. కన్వర్షన్ రేట్ చాలా బాగుంటుంది.

అమెజాన్ ఓకే. ఫ్లిఫ్ కార్ట్ ... లో పైరసీ చేస్తున్నారు. ఈ విషయంలో వారితో పోటీపడలేం. పైరసీ విషయంలో రీడర్స్ నుంచి సపోర్ట్ దొరకదు.  ఇది మారాలంటే చాలా టైం పడుతుంది

పుస్తకాల మీద టాక్స్ ఏమిటి ? పేపర్ మీద, ప్రింటింగ్ సర్వీసెస్ మీద టాక్స్ కడుతున్నారు పబ్లిషర్స్. కానీ వాళ్ళు అమ్మే పుస్తకాల మీద పాఠకుల నుంచి టాక్స్ వసూలు చేయకూడదు. ప్రభుత్వం పబ్లిషింగ్ రంగం మీద టాక్స్ వెసులుబాటు కల్పించాలి.

బుక్ ఫెయిర్లలో ట్రెడిషనల్ పబ్లిషర్లు కొత్త ప్రచురణకర్తలను కలుపుకుపోవాలి.అక్కడ లోపం ఉంది. ఓపెన్  గా ఉండాలి. ఇంక్లూజివిటీ తక్కువగా ఉంది.వారి అనుభవాలు, మా ఆలోచనలు కలిస్తే బాగుంటుంది.


-ములుగు రాజేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్

...........


యు.పి పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పని సరి ... పుష్ప గుచ్ఛాలు, జ్ఞాపికలకు బదులు పుస్తకాలు- ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

Comments

  1. మూడూ చదివాను సర్! సూక్ష్మ విషయాలు సుసూక్ష్మంగా చెప్పారు.
    1. పుస్తకాల అమ్మకాల విషయంలో తెలుగు సాహిత్యం (దాని అన్ని ప్రక్రియలూ కలుపుకొని) అమ్ముడు పోవటం లేదనటం అసత్యం.
    2. దానికి ఋజువు బుక్ ఫెయిర్.
    3. పుస్తకం అమ్ముడు పోవడానికి తగిన ప్రచార వ్యూహాలు లేవనటం మాత్రం చాలా వరకూ నిజం.
    4. అన్వీక్షకి వంటి వారు సామాజిక మాధ్యమాలను సమర్ధంగా వాడుతున్నారు.
    5. రచయిత కేవలం వ్రాయడం మాత్రమే తన కర్తవ్యం అనుకోకుండా తనలో ఒక వ్యాపార దృక్పథాన్ని పెంచుకోవడం కూడా అవసరం.
    6. ప్రచురణకర్త + రచయిత + ప్రచారం × వ్యూహం = అమ్మకాలు అనే ధోరణి మాత్రమే పుస్తకాన్ని బ్రతుకిస్తుందేమో!
    7. ఇటీవలి కాలంలో (మూడు నెలల వ్యవధిలో) నేను కేవలం ఫేస్ బుక్ లో రచయితలు స్వయంగా తెలియచేసిన తమ ప్రచురణ వివరం చూసి ఏడు పుస్తకాలు కొన్నాను.

    -ఫణిహారం వల్లభాచార్య

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఒక ప్రయోగశీలి అనుభవాల సంపుటి ఇది

It reminded me of my life...

అతడొక సముద్రం!

తెలుగు పుస్తకాన్ని చంపుతున్నది ఎవరు ?

పుస్తకాల ప్రచురణ వ్యాపారమా !!!

Simply, ‘unputdownable’

అతడనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు...